COVID-19: కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా తిరుపతి అర్బన్ పరిధిలో 65 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు జూలై 23న పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 49 కేసులు నమోదయ్యాయి.
ఒక్క శనివారం రోజే 10 కొత్త కేసులు బయటపడటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ కొత్త కేసులు గుర్తించారు. ఈసారి కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం. తిరుపతి, కృష్ణా, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో మరణం నమోదైంది.
మరోవైపు వైరస్ నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపగా, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని ఆరోగ్యశాఖ పేర్కొంది.
ALSO READ: Pawan Kalyan | తక్కువ ధరకే బియ్యం విక్రయాలు.. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం: పవన్ కళ్యాణ్








