NEET paper leak: నీట్ పేపర్ లీక్ ఘటనపై నెలకుపైగా కొనసాగిన విద్యార్థుల నిరసనలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. కేంద్రంతో మూడోసారి జరిగిన చర్చల అనంతరం సీజేపీ (CJP) నేతలు ఆందోళన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్, సౌరవ్ దాస్ పాల్గొన్నారు. తమ మూడు ప్రధాన డిమాండ్లలో ఒకటైన మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పటికే నెరవేరిందని వారు తెలిపారు.
మరోవైపు ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిర్వాహకులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అలాగే నీట్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలకు పాల్పడిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఈ అంశాలపై మంగళవారం లోపు లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం అంగీకరించిందని సీజేపీ పేర్కొంది. అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ, నిబంధనలకు అనుగుణంగా కేసుల ఉపసంహరణతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.








