Stock Markets: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు మరోసారి బలహీనంగా ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో కీలక సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈ సెన్సెక్స్ 238.41 పాయింట్లు పడిపోయి 77,470.11 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.80 పాయింట్లు కోల్పోయి 24,187.70 వద్ద స్థిరపడింది. అయితే విస్తృత మార్కెట్లో మాత్రం సానుకూల ధోరణి కనిపించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు లాభాలతో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీలు బలహీనపడగా, కెమికల్స్, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లు నమోదయ్యాయి. నిఫ్టీ-50లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడులు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. నిఫ్టీకి 24,150-24,100 స్థాయిలు కీలక మద్దతుగా, 24,300-24,400 స్థాయిలు నిరోధకంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ: Ravi Shastri | రోహిత్‌ను పక్కన పెట్టాలనుకున్నారా?.. శాస్త్రి కామెంట్స్ వైరల్








