హైదరాబాద్‌లో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్(Hitech City Railway Station)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 75 రైల్వేస్టేషన్‌లను పంజాబ్‌లోని జలంధర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి ప్రారంభించారు.
తెలంగాణ నుంచి ఈ జాబితాలో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు స్థానం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలను ఆధునికీకరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్టేషన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సెల్ఫీ పోటీలో గెలుపొందిన వారిని కూడా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.








