Minister Seethakka: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ పనితీరుపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన “నీళ్లు, నిధులు, నియామకాలు” హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిరుద్యోగ యువతను నిరాశపరిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు సీతక్క తెలిపారు. పారదర్శకంగా, ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నిరుద్యోగులకు మంత్రి సీతక్క సూచించారు.








