Telangana Bonalu 2026: తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాలు ఈసారి జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకలు ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
బోనాల ఉత్సవాలకు సంబంధించిన అధికారిక పోస్టర్, బ్రోచర్‌ను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గంగా-జమునా తహజీబ్‌కు బోనాల పండుగ ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. భిన్న మతాల మధ్య సోదరభావాన్ని చాటిచెప్పే ఈ ఉత్సవాలు రాష్ట్ర ప్రత్యేకతను దేశానికి పరిచయం చేస్తున్నాయని తెలిపారు.
ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం జూలై 16న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల సంబరాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జూలై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూలై 26న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం జరగనుంది.
ఆగస్టు 2న లష్కర్ బోనాలు, ఆగస్టు 9న పాతబస్తీ బోనాలు వైభవంగా నిర్వహించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ జరుగుతుంది. ఆగస్టు 10న అమ్మవారి భవిష్యవాణిగా భావించే ‘రంగం’ కార్యక్రమంతో పాటు సంప్రదాయ ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సేవలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈసారి కూడా బోనాల వేడుకలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ALSO READ: Spain Wildfire | స్పెయిన్‌లో భీకర కార్చిచ్చు.. ప్రాణాలు కోల్పోయిన 12 మంది ?








