Telangana Rain Alert: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 10న వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూన్ 11, 12 తేదీల్లో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతరం జూన్ 12 తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోనూ వాతావరణ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉండగా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం పెరిగి, వర్షాలు మరింత విస్తృతంగా కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో వాతావరణం మార్పులతో కూడిన పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ALSO READ: Airtel | ఏడాది పాటు కాల్స్ ఫ్రీ.. ఎయిర్టెల్ కొత్త రూ.1,849 ప్లాన్ లాంచ్








