ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2026(World Food India 2026) కార్యక్రమంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జులై 9, 10 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ‘సదరన్ స్టేట్ ఎడిషన్’ పేరుతో నిర్వహించే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
అదనంగా అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఆహార శుద్ధి పరిశ్రమలకు మార్కెట్ విస్తరణ, వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుంది. రెండు రోజుల కార్యక్రమంలో ఉత్పత్తుల ప్రదర్శనలు, ప్రత్యేక స్టాల్స్, బి2బి, బి2జి సమావేశాలు, బయ్యర్-సెల్లర్ మీట్లు నిర్వహించనున్నారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహక పథకాలు, సబ్సిడీలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సు ద్వారా కొత్త పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఆహార శుద్ధి రంగంలో వ్యాపార అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.








