Anthropic AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. సంస్థ మొత్తం 65 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించగా, దీని మార్కెట్ విలువ ఏకంగా 965 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుందనే నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సెక్వోయా క్యాపిటల్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆంథ్రోపిక్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఒక్కో సంస్థ సుమారు 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల సంఖ్య పెరుగుతోంది.
ఎన్విడియా, ఆల్ఫబెట్, యాపిల్ సంస్థలు ఇప్పటికే 4 ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ను నమోదు చేశాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా భారీ స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తున్నాయి. ఇక చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ కూడా త్వరలో ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది.
సంస్థ మార్కెట్ విలువను ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆంథ్రోపిక్ ఇప్పటికే 900 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడంతో, ట్రిలియన్ డాలర్ల విలువను అందుకునే తొలి ఏఐ స్టార్టప్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








