Telangana Government: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు అందుతున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలను ఒకే వ్యవస్థలో సమీకరించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ కార్డు ద్వారా ప్రతి పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద ఎంత లబ్ధి అందుతోందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం అన్ని శాఖల నుంచి సంక్షేమ పథకాల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. ఈ డేటాను ఏఐ సాయంతో విశ్లేషించడం ద్వారా పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన వారికి పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అనర్హులను గుర్తించడం సులభమవుతుందని సీఎం పేర్కొన్నారు.
ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇవ్వకుండా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న యువ అధికారులను వినియోగించాలని సీఎం సూచించారు. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, బీమా పథకాలు, కార్మిక, విద్యా శాఖల లబ్ధి వివరాలు అన్నీ ఉండనున్నాయి. అవసరమైతే ఆధార్ తరహాలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలని కూడా పరిశీలిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటాను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ డేటా కూడా ఇందులో భాగం కానుంది. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ద్వారా మరణ ధృవీకరణ, పెన్షన్ డేటా వంటి సమాచారం రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసే సమర్థవంతమైన డిజిటల్ వ్యవస్థగా ఈ సమగ్ర సంక్షేమ కార్డు పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.








