ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఎబోలా(Ebola) వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకుగురిచేస్తుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన ఓ మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో కర్ణాటక వైద్యశాఖ అప్రమత్తమైంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం 28 ఏళ్ల మహిళ ఈ నెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు స్వల్ప అనారోగ్య లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను వెంటనే ప్రత్యేక వైద్య పర్యవేక్షణలోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆమె రక్త నమూనాలను సేకరించి మరింత నిర్ధారణ కోసం పుణెలోని జాతీయ వైరస్ పరిశోధన సంస్థకు పంపించారు. మరో రెండు రోజుల్లో పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహిళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
కర్ణాటక ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే మాట్లాడుతూ.. పరీక్షల అనంతరం మాత్రమే ఆమెకు నిజంగా ఎబోలా సోకిందా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఎబోలా వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల మధ్య రష్యా కీలక ప్రకటన చేసింది.
బుండిబుగ్యో రకానికి చెందిన ఎబోలాపై సమర్థంగా పనిచేసే టీకాను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. కొత్తగా గుర్తించిన ఎబోలా రకంపై ఈ టీకా సమర్థవంతమైన రక్షణ కల్పించే అవకాశం ఉందని పేర్కొనడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.








