Karnataka Boat accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం నదిలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలూకా శిరాలి సమీపంలోని కాళీనట్టి పాయ వద్ద జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
స్థానిక సమాచారం ప్రకారం, పడుశిరాలి గ్రామానికి చెందిన 14 మంది కుటుంబ సభ్యులు వెంకటాపుర నదిలో ఆల్చిప్పలను సేకరించేందుకు పడవలో వెళ్లారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మొదట ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కొనసాగించిన గాలింపు చర్యల్లో సోమవారం తెల్లవారుజామున మరో మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది. ఇంకా ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం.
మరణించిన వారిని లక్ష్మీ మహాదేవ నాయక్ (38), లక్ష్మీ శివరామ్ నాయక్ (39), ఉమేష్ మంజునాథ్ నాయక్ (42), మస్తమ్మ మంజునాథ్ నాయక్ (43), లక్ష్మీ అన్నప్ప నాయక్ (44), జ్యోతి నాగప్ప నాయక్ (37), మాలతి జట్టప్ప నాయక్ (38) తదితరులుగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








