రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యత మరింత బలపడాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, వై. రవీందర్ యాదవ్, సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, మామిళ్ల విటల్తో పాటు పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది.








