Iran Us War: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధవిమానాలు ఇరాన్ దాడుల్లో కూలిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అందులో ఒకటి ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్, మరొకటి ఏ-10 వార్‌థాగ్ కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ఈ రెండు సంఘటనలు దాదాపు ఒకే సమయంలో చోటుచేసుకోవడం అమెరికా సైనిక వ్యూహాలపై కొత్త చర్చకు దారితీసింది.
అమెరికా అధికారిక వర్గాల ప్రకారం, ఎఫ్-15ఈ విమానంలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని రక్షించగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే సమయంలో హర్మూజ్ సమీపంలో దెబ్బతిన్న ఏ-10 యుద్ధవిమానం పైలట్ కువైట్ వైపు వెళ్లి సురక్షితంగా బయటపడ్డాడు.
గల్లంతైన సిబ్బందిని వెతికేందుకు పంపిన రెండు హెలికాప్టర్లపై కూడా దాడి జరిగినప్పటికీ, అవి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలు, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అమెరికా అంచనాల కంటే బలంగా పనిచేస్తున్నాయన్న అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. ఇప్పటికే తమకు ఎయిర్ సుపీరియారిటీ ఉందని అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్న వేళ, వరుసగా రెండు యుద్ధవిమానాలు దెబ్బతినడం చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “మేం యుద్ధంలో ఉన్నాం” అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపవని కూడా ఆయన స్పష్టం చేశారు.








