Hyderabad–Vijayawada: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి భారీ ట్రాఫిక్ రద్దీతో నిండిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే వాహనాలు అధికంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా(Panthangi toll plaza) వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇక్కడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పెద్ద కాపర్తి, చిట్యాల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది.
ALSO READ:తొలి రోజే దుమ్మురేపిన మెగాస్టార్….BOX OFFICE కలెక్షన్స్ ఎంతంటే ?
పండుగ సెలవుల కారణంగా ఉదయం నుంచే హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుండగా, టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లింపుల ప్రక్రియ ఆలస్యం కావడం ట్రాఫిక్ జామ్‌కు కారణంగా మారింది.
పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో సాఫీగా కదలిక సాధ్యపడటం లేదు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే ప్రయాణ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.
రాత్రి వేళల్లో ప్రయాణం చేయడం లేదా ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాలను ఎంచుకోవడం ద్వారా ఇబ్బందులను తగ్గించుకోవచ్చని తెలిపారు.
