Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు లింగ రాజా, యాత్ర రాజాతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారికి రజినీకాంత్ తులాభారంతో మొక్కు చెల్లించారు. రజినీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో తులాభారం నిర్వహించగా, లతా రజినీకాంత్ 82 కిలోలతో మొక్కు చెల్లించారు.
డిసెంబర్ 12న తన పుట్టినరోజు సందర్భంగా 76వ వసంతంలోకి అడుగుపెట్టిన రజినీకాంత్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తుండగా, షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
