రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రంగారెడ్డి జిల్లాను అంతరించేలాగా, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రయత్నించడం సరికాదని ఆయన హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా నాయకులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన కుటిల బుద్ధిని బయటపెడుతున్నాయని అన్నారు.
ALSO READ:Telangana government | భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
“ఫ్యూచర్ సిటీ పేరుతో 56 గ్రామాలు నాశనమయ్యాయి. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ ఆలోచన ప్రజలపై భారీ ఆర్థికభారం మోపింది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి అని పేర్కొన్న మంచిరెడ్డి, “ఇక్కడి ఆదాయాన్ని ఇక్కడికే ఖర్చు చేయాలి. పక్క జిల్లాలకు మళ్లించడం అన్యాయం,” అని తీవ్రంగా స్పందించారు.
చెన్నారెడ్డి హయాంలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం తెరాస ప్రభుత్వం మూడు జిల్లాలుగా వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పునర్వ్యవస్థీకరించిందని గుర్తుచేశారు. అలాగే 3 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం కూడా అప్పుడే జరిగిందని అన్నారు.
KCR ప్రభుత్వ కాలంలోనే భారీ పెట్టుబడులు రంగారెడ్డిలోకి వచ్చాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా పెట్టుబడులు రాకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల రంగారెడ్డి జిల్లా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు కబ్జాలు, కమిషన్లతో పరిపాలన సాగిస్తున్నారనే ఆరోపణలు చేస్తూ, “ఇప్పటికైనా మారాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలించాలి… లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు” అని హెచ్చరించారు.
