ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2025లో అత్యంత ప్రభావవంతుల జాబితాలో భారతీయ సంతతికి చెందిన రేష్మా కేవల్ రమణి చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులతో పాటు ఆమె పేరు కూడా చోటుచేసుకుంది. అయితే భారతదేశం నుంచి ఎవరూ లేకపోవడం గమనార్హం.
రేష్మా రమణి ప్రస్తుతం అమెరికాలోని వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. పదకొండేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లిన ఆమె అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, బయోటెక్ రంగంలో అగ్ర స్థానానికి ఎదిగారు. ఇది ఆమెకి TIME జాబితాలో చోటు దక్కించడంలో కీలకమైన ఘట్టంగా నిలిచింది.
సికిల్ సెల్ వ్యాధికి గల జీన్లలో మార్పులు చేసి చికిత్స అందించే క్రిస్పర్ ఆధారిత థెరపీకి అమెరికా FDA ఆమోదం తెలపడంలో రమణి కీలక పాత్ర పోషించారు. ఈ అంశాన్ని టైమ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. డీఎన్ఏ ఆధారిత వైద్యం ద్వారా అనేక రోగాలకు పరిష్కారాలు సాధ్యపడతాయని, రేష్మా లాంటి నాయకులు భవిష్యత్ ఆరోగ్యరంగాన్ని మలుపుతిప్పతారని TIME రచయిత పేర్కొన్నారు.
‘లీడర్స్’ విభాగంలో రమణితో పాటు యూకే ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ వంటి ప్రముఖులు ఉన్నారు. తన కృషితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రేష్మా భారతీయులకే గర్వకారణంగా నిలిచారు. TIME జాబితాలో ఆమె స్థానం అనేది ఎన్నో యువతికి ప్రేరణగా నిలుస్తోంది.