తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రామగుండం ఎన్టీపీసీ (NTPC) రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (PPA) త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా 3X800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎన్టీపీసీ ఇప్పటికే చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి దశ తరహాలోనే, ఈ రెండో దశ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సైతం 85 శాతం తెలంగాణకే సరఫరా కానుందని ఆయన స్పష్టం చేశారు. అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా, తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.







