Vantalagummi: జాతరకు వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని వంతలగుమ్మి సమీపంలో చోటుచేసుకుంది.
“గెమ్మలి రమేశ్ (22), సిదరి శ్రీధర్ పౌలు (17), రేగం సూర్యప్రకాష్ (21)” అనే ముగ్గురు సన్నిహిత మిత్రులు. మహాశివరాత్రి సందర్భంగా హుకుంపేట మండలంలో నిర్వహించిన మత్స్యగుండం జాతరకు వీరు వెళ్లారు. వేడుకలు ముగిసిన అనంతరం ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వంతలగుమ్మి సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ద్విచక్రవాహనం అధిక వేగంతో అదుపుతప్పింది. రెండు విద్యుత్ స్తంభాల మధ్యగా వెళ్లి సమీపంలోని ఓ ఇంటి గోడను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటన సమాచారం అందుకున్న పాడేరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామాల్లో శోకసంద్రత వాతావరణం నెలకొంది.








