Telangana SSC Results: తెలంగాణ పదో తరగతి (SSC) ఫలితాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా ఫలితాల విడుదల తేదీని ఖరారు చేసింది. రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మార్చి 14 నుంచి ప్రారంభమైన SSC ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఏప్రిల్ 23న ముగించారు. తొలుత ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో విడుదల అవుతాయని భావించినప్పటికీ, తాజా నిర్ణయంతో ముందుగానే రిజల్ట్స్ ప్రకటించనున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.








