Friday, March 6, 2026
No menu items!
Google search engine
HomeTelanganaTelangana New Governor | కేంద్రం కీలక నిర్ణయం | తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం

Telangana New Governor | కేంద్రం కీలక నిర్ణయం | తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం

- Advertisement -
Google search engine

కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో మార్పులు చేసింది. ఈ క్రమంలో శివ్‌ప్రతాప్‌ శుక్లా(Shiv Pratap Shukla)ను తెలంగాణ కొత్త గవర్నర్‌(Telangana New Governor)గా నియమించింది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్‌ వర్మను(Jishnu Dev Varma) ను మహారాష్ట్రకు బదిలీ చేసింది.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శుక్లాను తెలంగాణకు పంపుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మొత్తం తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల్లో మార్పులు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ 2024 జులై 31న బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 నెలలు సేవలందించారు. తన పదవీకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. కవి, రచయితగా పేరున్న ఆయన అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆయన ఆమోదం తెలపడం ద్వారా ఆ ప్రక్రియకు మార్గం సుగమమైంది. అలాగే కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామపంచాయతీల విలీన బిల్లులు, జీహెచ్‌ఎంసీ విభజన ఆర్డినెన్స్ వంటి కీలక నిర్ణయాలకు కూడా ఆయన ఆమోదం తెలిపారు.

కొత్తగా నియమితులైన శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాకు చెందినవారు. 1952 ఏప్రిల్ 1న జన్మించిన ఆయన న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రాజకీయ జీవితాన్ని విద్యార్థి సంఘం ఏబీవీపీ ద్వారా ప్రారంభించారు.

తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, అనంతరం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఆయన ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన రాజీనామాను ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గవర్నర్ పదవుల్లో జరిగిన మార్పులు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular