నాలుగేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన వామనరావు-నాగమణి దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 27న న్యాయవాది గట్టు వామనరావు, నాగమణి దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అన్ని రికార్డులను తమ ముందుంచితే వాటిని పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలని ఆదేశించింది.
ఇప్పటికే ఈ కేసుపై గతంలో కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించింది. సీబీఐ తరఫున న్యాయవాది మాట్లాడుతూ, కోర్టు ఆదేశిస్తే విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉందని కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం అన్ని ఆధారాలను సమర్పించిన అనంతరం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.