సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన కార్తీక్ రెడ్డి (26) తరచూ కుటుంబ సభ్యులతో ఆస్తి కోసం గొడవపడేవాడు. ఈ రోజు తెల్లవారుజామున తల్లి రాధిక (52)తో తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆవేశంలో కార్తీక్ కత్తితో ఆమెపై దాడి చేసినట్టు సమాచారం.
తన కుమారుని దాడిలో తీవ్రంగా గాయపడిన రాధిక రక్తపు మడుగుల్లో పడిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నల్లగండ్లలోని సిటిజెన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేసింది.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడైన కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసై, ఆస్తి కోసం తల్లినే హత్య చేయడం పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంత దారుణంగా మారటం బాధకరమని, కార్తీక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.