ఇటీవల ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు వరుస ఓటములు ఎదురవడంతో వైట్‌బాల్ క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ తన పదవికి రాజీనామా చేశారు. వన్డేలు, టీ20ల్లో ఇంగ్లండ్ విఫలమవుతుండటంతో బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేస్తూ తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు.
“ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్‌గా రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది. దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఇది సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞతలు. ముఖ్యంగా నా భార్య, కుటుంబ సభ్యులు నా ప్రయాణంలో కీలకమైన స్థంభాలు” అని బట్లర్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.
ఇంగ్లండ్ జట్టు ఇటీవల భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయింది. అలాగే, ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయాలతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో జోస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగారు.
బట్లర్ రాజీనామా ఇంగ్లండ్ క్రికెట్‌లో కొత్త చర్చకు దారితీసింది. కొత్త కెప్టెన్ ఎవరవుతారనే ఆసక్తి క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది. గతంలో ఇంగ్లండ్‌ను ఐసీసీ టైటిల్స్ గెలిపించిన బట్లర్, ఇప్పుడు తన కెప్టెన్సీ బాధ్యతలను ముగించడంతో అభిమానులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.