నాతవరం మండలంలో శృంగవరం నుంచి గన్నవరం మెట్ట కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రూ. 14 కోట్లతో చేపట్టే 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఐదు నెలల పరిపాలనలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 78.67 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
శృంగవరం, ఎంబీపట్నం, మన్యపురట్ల, శరభవరం, గన్నవరం, ఏపీపురం గ్రామాల్లో రోడ్ల పనులకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని, జంక్షన్ నుంచి మన్యపురట్ల జంక్షన్ వరకు రూ. 90 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వైబీఅగ్రహారం నుంచి ఉప్పరగూడెం వరకు, ఉప్పరగూడెం నుంచి కాకరాపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 1.40 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఐదు నెలల్లో నాతవరం మండలానికి రూ. 21 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల వరకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ నెల 8న జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో విజయమే అభివృద్ధి పనులకన్నా ముందుందని తెలిపారు. నీటి సంఘాల ఎన్నికల్లో గెలిస్తేనే అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
తాండవ ఎత్తిపోతల కోసం రూ. 2,400 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నిధులతో సంఘం ఆధ్వర్యంలోనే పనులు జరుగుతాయని తెలిపారు. రాజకీయాలకి దూరంగా ఉండి గ్రామాభివృద్ధి కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
పాల్గొన్నవారిలో ఆర్డీవో రమణ, టీడీపీ నాయకులు నానిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజనా వీరసూర్యచంద్ర, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గాంధీనగరం వద్ద ఉన్న ప్రభుత్వం స్థలాన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరారు.