మాదిగల హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాదిగ సమాజ హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక (Shilpakala Vedika) లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మిత్రుడి కోసం చివరి ఊపిరి వరకు నిలిచిన కర్ణుడిలా తాను కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ మాదిగల పక్షాన నిలబడ్డానని చెప్పారు.
రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం ఫలించింది
2023 ఎన్నికల్లో ప్రజలు కష్టపడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని సీఎం పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.
ప్రజాజీవితంలోకి వచ్చినప్పటి నుంచి మాదిగల సమస్యలను గమనిస్తూ వచ్చానని, వారి న్యాయమైన హక్కుల సాధనలో తమ ప్రభుత్వం ముందుండి పనిచేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఈ అంశాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
విద్యతోనే భవిష్యత్ మారుతుంది
ప్రజలకు పంచడానికి ప్రభుత్వానికి భూములు లేవని, కానీ చదువు అనే ఆస్తిని మాత్రం అందించగలమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
గత ప్రభుత్వాలు గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలు ఇచ్చాయని, కానీ తమ లక్ష్యం మాత్రం చెప్పులు కుట్టే ఈ సమాజానికి చెందిన యువత డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగడం కావాలని సీఎం అన్నారు. భవిష్యత్‌లో మాదిగల హక్కులకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.









