Helicopter Crash: ఆదివారం రియో డి జనీరోలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాల్లోనే రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్, కమెడియన్ ఒలివర్ ట్రీతో పాటు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక అధికారుల వివరాల ప్రకారం, రెక్రియో డోస్ బాందీరాంటెస్ ప్రాంతం సమీపంలో యూరోకాప్టర్ AS350, బెల్ 206 మోడళ్లకు చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం విమాన శకలాలు సమీపంలోని చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ (BYD)కు చెందిన పార్కింగ్ యార్డుపై పడ్డాయి.
దీంతో అక్కడ నిలిపి ఉంచిన సుమారు 20 లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారినట్లు అధికారులు తెలిపారు. సంగీత వీడియో చిత్రీకరణ కోసం బ్రెజిల్‌కు వచ్చిన ఒలివర్ ట్రీ ఈ ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించారు.
ఆయనతో పాటు అర్జెంటీనా యూట్యూబర్ గాస్పర్ ప్రిమ్ డియాస్, దర్శకుడు లూకాస్ విగ్నాల్, సంగీత నిర్మాత లూకాస్ బ్రిటో చావెస్‌తో పాటు ఇద్దరు పైలట్లు కూడా మృతి చెందారు. ‘లైఫ్ గోస్ ఆన్’, ‘మిస్ యూ’ వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒలివర్ ట్రీ ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
ప్రమాదానికి గల కారణాలపై బ్రెజిల్ ఏవియేషన్ అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా పైలట్ల తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Helicopter Crash | బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, ప్రముఖ సింగర్ ?
-








