పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారేసరికి చనిపోతున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం పెంచిన కోళ్లు ఈ వైరస్ బారిన పడడంతో పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఈ వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరి జిల్లాను భయపెట్టింది. అప్పట్లో కోళ్ల మరణాల కారణంగా మార్కెట్‌లో అమ్మకాలు పూర్తిగా పతనమయ్యాయి. కోళ్ల వ్యాధి తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి ఇదే వైరస్ విజృంభిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వైరస్ సోకిన కోళ్లకు ప్రత్యేక లక్షణాలు కనిపించకపోవడం, వేగంగా వ్యాపించడం పెంపకందారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
వైద్యుల ప్రకారం, ఈ వైరస్ కోడి గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. గుండె చుట్టూ నీరు చేరి గుండెపోటుతో కోడి మరణిస్తుంది. వైరస్ సోకిన కోడి వల్ల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కోళ్లకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వైరస్ వేగంగా వ్యాపించడం వల్ల కొన్ని గంటల్లోనే పెంపక కేంద్రాల్లోని అన్ని కోళ్లు చనిపోతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా పని చేయడం లేదని వైద్యులు వెల్లడించారు.
మృత్యువాత పడిన కోళ్లను రహదారుల పక్కన పడేయడం వల్ల వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కబేళాలోని మృత కోళ్లను కనీసం 3 అడుగుల లోతున పూడ్చి, సున్నం వేసి నశింపజేయాలని లేదా కాల్చేయాలని సూచిస్తున్నారు. కోళ్ల మాంసం తినడం ప్రమాదకరమని, ప్రజలు మాస్కులు, గ్లవ్స్ వంటివి ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోళ్ల ధరలు పడిపోవడం, అమ్మకాలు తగ్గడం వంటి ప్రభావాలు మార్కెట్‌పై కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పెంపకందారులకు వైద్యులు సూచించారు.