సంక్షేమ పథకాలపై అరకొర నిధులు కేటాయించారని ఆలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ చెప్పిన చంద్రబాబు ఎక్కడ అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ మహిళకు రూ.1500 అందించాలన్న హామీ గాల్లో కలిసిందని అన్నారు. తల్లికి వందనం పథకం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.
సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను పార్టీ వర్గీకరణతో అమలు చేస్తున్నారని విరుపాక్షి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా అందించాలని, ఇది పార్టీలకు అతీతంగా ఉండాలన్నది తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు. వైయస్సార్సీపీ హయాంలో అన్నీ వర్గాలకు ప్రయోజనం కలిగించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులకు అన్యాయం చేస్తోందని అన్నారు.
రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే విరుపాక్షి తీవ్రంగా మండిపడ్డారు. వేదవతి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఇది చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని అన్నారు. రాయలసీమ ప్రజలకు కరువు నివారణకు సంబంధించిన ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టుకైనా నిధులు కేటాయించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు మేలు చేసేవారికే భవిష్యత్తులో మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.