బాపులపాడు మండలం మడిచర్ల, కానుమోలు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు ఈరోజు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శుభారంభం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఈ రోడ్ల పనులు పూర్తి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ మడిచర్ల గ్రామంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో బీటీ మరియు సీసీ రోడ్లు, కానుమోలు బీసీ కాలనీలో రూ.23 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని అభివృద్ధి ఫలాలను పంచుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, రహదారుల రూపురేఖలు మార్చడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.