ఛత్తీస్‌గఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. నక్సల్స్ సమూహం అడవుల్లో తిష్టవేసి ఉన్నారని ముందస్తు సమాచారం మేరకు గురువారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోలు ఎదురు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి.
ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు 18 మంది మావోయిస్టులను హతమార్చాయి. ఘటనా స్థలంలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలకు చెందిన ఓ జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా కొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో కాంకెర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్, డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మట్టుబడ్డారు. భద్రతా బలగాలు అడవుల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో యాంటీ-నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలను పూర్తిగా అణచివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.