Uppal Metro Station: హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఐపీఎల్ 2026లో భాగంగా IPL మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం నగరంలో ఆందోళనకు దారితీసింది. శనివారం SRH మరియు CSK మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఫోన్ చేసి, స్టేషన్ పరిసరాల్లో బాంబు పెట్టినట్లు హెచ్చరించాడు. దీంతో మెట్రో అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమాచారం బయటకు రావడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా, ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.
మెరుపు తనిఖీలు.. హోక్స్ కాల్‌గా తేల్చిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లు, ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ ప్రాంతం వంటి ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది కేవలం ‘హోక్స్ కాల్’ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
శనివారం సాయంత్రం 7:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత పెంచారు. అదనపు సిబ్బందిని మోహరించి, తనిఖీలను కఠినతరం చేశారు.
నిందితుడి కోసం గాలింపు
బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి తప్పుడు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.








