తెలుగుదేశం పార్టీకి అప్రతిష్టతిస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రబోయిన వెంకటేశ్వరరావును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, నూజివీడు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు, రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాపా మాట్లాడుతూ నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అక్రమ క్వారీయంగా జరుగుతోందని ముద్రబోయిన ఆరోపించటం దారుణం అన్నారు. ప్రజల అవసరాల కోసం మట్టిని తవ్వి వినియోగిస్తుంటే ఎందుకు అంతటి ఆక్రోసం అని ప్రశ్నించారు.
గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ముద్ర బోయిన మట్టి స్కామ్ చేసిన సంగతి అందరికీ తెలుసు అన్నారు. అందరూ తనకు మల్లె స్కామర్స్ గా భావించడం తగదన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఉచిత ఇసుకతో పాటు ఉచితం మట్టి అందించే కార్యక్రమం కచ్చితంగా అవసరమని అన్నారు. ఇంటి నిర్మాణం, లే వుట్ల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు మట్టి ఎంతో అవసరమని అన్నారు. డబ్బు ఉన్నప్పటికీ మట్టి లేక ఎన్నో కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని సోదాహరణంగా వివరించారు.
తెలుగుదేశం పార్టీలో రాష్ట్రస్థాయి పదవి ఉన్నప్పటికీ స్థానిక రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఇతర టిడిపి నేతలకు అందుబాటులో లేకుండా, మద్దతు పలకకుండా ఉన్న ముద్రబోయిన పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. లావు ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు మాట్లాడకపోయినా సొంత పార్టీలో ఉన్న ముద్రబోయిన ప్రతిపక్షాని కంటే దారుణంగా మాట్లాడి పార్టీ పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రబోయిన పై అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తామంతా ముద్రబోయిన పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.