వైయస్ జగన్ సర్కార్ నుంచి విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేసిన ఎస్.ఎన్.పాల్ (స్వరూపానందేంద్ర సరస్వతి) కు అండగా నిలిచిన మంత్రి వ్యవహారం నిగ్గు తేల్చాలని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశమై ఆయన శుక్రవారం ఉదయం విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను ఆయన క్యాంప్ కార్యాలయం శివాజీ పార్క్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్.ఎన్.పాల్ కు కేటాయించిన 15 ఎకరాల భూమిని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించి తెలుగు శక్తి నిరంతరం పోరాటం చేస్తోందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి భీమిలిలో కేటాయించిన ఆ 15 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించారన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఎస్.ఎన్.పాల్ కు అనుకూలంగా ఉన్నాయని రామ్ వ్యాఖ్యానించారు. శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించినా.. సంబంధిత ఫైల్ వెనక్కి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీని వెనుక ఒక కీలకమైన మంత్రి భూముల కేటాయింపును రద్దు చేయకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కీలక మంత్రి ఎవరో.. ఎస్.ఎన్.పాల్ (స్వరూపానందేంద్ర సరస్వతి) తో అతనికి ఉన్న సంబంధం ఏమిటో నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని బి.వి.రామ్ డిమాండ్ చేశారు . ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. శారదా పీఠం భూముల కేటాయింపు అంశం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ జనసేన అధినేత మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కు హామీ ఇచ్చారు.