హైదరాబాద్ వాటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. నగరంలో నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచే పనుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మంజీరా ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు సంబంధించిన పెద్దాపూర్ పంప్ హౌస్ (Peddapur Pump House) వద్ద మరమ్మతులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెద్దాపూర్ పంప్ హౌస్‌లో గత 35 ఏళ్లుగా ఉపయోగిస్తున్న పాత హెచ్‌టీఈ ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పెద్దాపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం భారీ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను మారుస్తున్నారు.
అదేవిధంగా 2000 ఎంఎం పైప్‌లైన్‌లో ఉన్న ఎయిర్ వెంట్స్‌ను కూడా అధికారులు కొత్తవిగా మార్చుతున్నారు. పంపింగ్ వ్యవస్థను బలోపేతం చేసి భవిష్యత్తులో నీటి సరఫరా అంతరాయాలు రాకుండా ఉండేందుకే ఈ పనులు చేపట్టినట్లు జలమండలి తెలిపింది.
ఈ మరమ్మతు పనులు మార్చి 7 శనివారం ఉదయం 8 గంటల నుంచి మార్చి 8 ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు.
ఈ కారణంగామణికొండ, కోకాపేట,నార్సింగి, మంచిరేవుల మరియు షేక్ పేట్, ప్రాంతాల్లోని కాలనీలకు నీటి సరఫరా ఉండదు. అలాగే భోజగుట్ట ప్రాంతంలో మాత్రం తక్కువ పీడనంతో మాత్రమే నీటిని విడుదల చేయనున్నారు.
ప్రజలు ముందుగానే అవసరమైనంత నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో స్థానిక జలమండలి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.









