కర్ణాటకలోని హుబ్లీలో భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పీటర్, ఫిబీ (పింకీ) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా, గత మూడు నెలలుగా వారు విడిగా జీవిస్తున్నారు. కుటుంబ సమస్యలు తీవ్రమవడంతో పీటర్ తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు.
సూసైడ్ నోట్‌లో “నా భార్య నన్ను చంపుతోంది. నేను చనిపోవాలని ఆమె కోరుకుంది” అని పీటర్ రాసిన మాటలు వైరల్ అయ్యాయి. భర్తను మానసికంగా వేధించినట్లు ఫిబీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. విడాకుల కోసం ఫిబీ సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని, ఆఫీస్ మీటింగ్లో ఉన్న సమయంలో ఫిబీ గొడవ చేయడంతో పీటర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిబీ, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పీటర్ ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, మానసిక ఒత్తిడే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ప్రమాదకరంగా మారుతున్న కుటుంబ కలహాలు పలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. హుబ్లీ ఘటనపై సమాజం మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం కల్పించాలని, బాధ్యులను శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.