సంగారెడ్డి జిల్లా దౌల్తాపూర్ గ్రామం ఇటీవల అనారోగ్యం బారిన పడింది. మొదట ఇద్దరితో ప్రారంభమైన మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పుల లక్షణాలు ఇప్పుడు గ్రామం మొత్తానికి విస్తరిస్తున్నాయి. గ్రామంలో 120 కుటుంబాలు నివసిస్తుండగా, ఇప్పటికే 40 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. మళ్లీ మరింత మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
కొంతమందిలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం ఆధ్వర్యంలోని దవాఖానల్లో పరీక్షలు చేయకుండానే కేవలం మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో గ్రామస్తులు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్థోమతలకు అనుగుణంగా మహారాష్ట్రలోని దెగ్లూర్, బాన్సువాడ, నిజామాబాద్‌లకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు కనీసం స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అనారోగ్యం బారిన పడుతుండగా, అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
పుల్కల్ పీహెచ్‌సీకి చెందిన డాక్టర్ సమద్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ విషయంపై తన దృష్టికి రాలేదని చెప్పారు. అయితే సోమవారం నుంచి గ్రామంలో తమ సిబ్బందితో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక హన్మవ్వ, లక్ష్మమ్మ వంటి బాధితులు తమ అనుభవాలను వివరిస్తూ స్పందన కోరుతున్నారు.