శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రూప్-2 అభ్యర్థులు భారీ ధర్నా నిర్వహించారు. 2023 డిసెంబర్‌లో వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో GO.77 ప్రకారం రిజర్వేషన్లు సరైన విధంగా కేటాయించలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని ఏళ్లుగా గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న తమ జీవితాలు అనిశ్చితిలో పడిపోతున్నాయని వారు వాపోయారు.
అభ్యర్థులు మాట్లాడుతూ, ప్రస్తుత నోటిఫికేషన్‌లో పాత విధానాన్ని కొనసాగించడం వల్ల అనేక మంది న్యాయం కోల్పోతున్నారని తెలిపారు. GO.77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలని, కానీ ప్రభుత్వం గత విధానాన్ని కొనసాగించడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులో రీడ్రా రోస్టర్ పాయింట్లు స్పష్టంగా చెప్పినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని వారు ఆరోపించారు.
రోస్టర్ లోపాలను సరిచేయకుండానే గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉందని అభ్యర్థులు హెచ్చరించారు. అందుకే రోస్టర్ సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తర్వాత మాత్రమే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో గ్రూప్-2 అభ్యర్థులు పి. నవీన్, జి. సునీంద్ర, టి. జగదీష్, ఎం. అరవింద్, ఇతర ప్రాంతాల అభ్యర్థులు పాల్గొన్నారు. అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని, తగిన సమయంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించి తాము న్యాయం పొందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.