Greenland Merger Bill: గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యంత్రాంగం ప్రయత్నాలు వేగం పెంచింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం – రాష్ట్ర హోదా’ పేరుతో అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికా రాష్ట్రంగా చేర్చే దిశగా ట్రంప్ ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక శక్తులు ప్రభావం పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ఈ చర్యలు అవసరమని రాండీఫైన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రష్యా, చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా కీలకమని వెల్లడించారు.
ALSO READ:Hyderabad–Vijayawada Highway Traffic | కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా…
ఇదిలా ఉండగా, గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్(Denmark) నుంచి వేరు చేయడానికి అక్కడి ప్రజలను ఆర్థికంగా ఆకర్షించాలనే యోచనలో అమెరికా ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఒక్కో వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు నగదు చెల్లించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రణాళికలను గ్రీన్‌లాండ్ నాయకత్వం తీవ్రంగా తిరస్కరించింది. తమ భవిష్యత్తును విదేశీ దేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ స్పష్టం చేశారు.
అమెరికా చర్యలపై నాటో దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం గ్రీన్‌లాండ్‌లో సుమారు 57 వేల మంది జనాభా నివసిస్తోంది.
