సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో సెప్టిక్ ట్యాంకర్ వాహనంలో 200 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి, కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ పటాన్‌చేరు ఎక్సైజ్ పోలీసులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించారు. గంజాయిని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. అక్రమ రవాణాకు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్న ముఠాను పట్టుకునేందుకు అధికారులు మరింత గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ కేసులో మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన దీపక్ నాగనాథ్ గోయి, నారాయణ్ ఖేడ్‌కు చెందిన బింసింగ్ మాధవ్‌ను అరెస్ట్ చేశారు. వారిని కఠినంగా విచారిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గంజాయి రవాణా ముఠా అంతర్దేశీయ నెట్‌వర్క్‌తో కలిసివున్న అవకాశముండడంతో దీనిపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణా నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద రవాణా కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు.