అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ విక్రయాన్ని పోలీసులు భగ్నం చేశారు. వాల్మీకిపురంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ ప్రసాద్ బాబు నేతృత్వంలోని పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు, రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
అరెస్టయిన వారిలో అంజమ్మ, సయ్యద్ ఖలీల్, సమీర్, కిరణ్, సిద్దార్థ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరంతా కలిసి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు కరిముల్లా, దస్తగిరి, వేణు, లక్ష్మీపతి, మధు, అబ్బుల్లకు ప్రత్యేక ప్రశంసలు అందినట్టు సీఐ తెలిపారు. ఈ అధికారుల సేవలను గుర్తించి, వారికి ప్రతిభా అవార్డులు ఇవ్వాలని ఎస్పీకి సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి సరఫరా చేసే ముఠాలపై నిరంతరం నిఘా పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు గంజాయి విక్రయంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.