
Ganga Expressway: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచిన గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రారంభించారు. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు విస్తరించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం 594 కిలోమీటర్ల పొడవుతో రాష్ట్రంలోనే అతిపెద్ద హైవేగా నిలిచింది.
సుమారు రూ.36,320 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ దేశంలోని ప్రధాన రహదారి ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఆరు లేన్లతో నిర్మించిన ఈ యాక్సెస్-కంట్రోల్ హైవేను భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్గంలో గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉండగా, భద్రత కోసం ఆధునిక సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర వాహనాలకు పూర్తిగా నిషేధం విధించారు.
ఈ మార్గం మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హార్డోయి, ఉన్నావ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ వంటి 12 జిల్లాల మీదుగా సాగుతుంది. దీంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిశ్రమల ప్రాంతాలు తూర్పు వ్యవసాయ ప్రాంతాలతో అనుసంధానం కల్పించబడుతుంది. ప్రస్తుతం 10–12 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా 6–8 గంటలకు తగ్గనుంది.
హైవేపై రెండు ప్రధాన టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 16 లేన్లతో ప్రత్యేక టోల్ గేట్లను నిర్మించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వేను మల్టీ పర్పస్ కారిడార్‌గా రూపకల్పన చేసి, పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లకు అనువుగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా షాజహాన్‌పూర్ వద్ద 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ నిర్మించడం ప్రత్యేకతగా నిలిచింది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే యమునా, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలు, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులతో అనుసంధానం కలిగి ఉంది. దీని ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుంది. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
భూముల విలువలు పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం వంటి ప్రయోజనాలతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా మారనుంది.








