ప్రొద్దుటూరు మున్సిపల్ 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వైయస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె రాజకీయ నిర్ణయంపై వైయస్సార్సీపీ నేత గజ్జల కళావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పోసా వరలక్ష్మికి రెండుసార్లు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించామని, కానీ ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు.
గజ్జల కళావతి మాట్లాడుతూ, పోసా వరలక్ష్మి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఆమె విజయానికి రాత్రింబవళ్లు పని చేసిన వారిని వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా ఆమెను గెలిపించామని, కానీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లడం ద్రోహమని విమర్శించారు.
పోసా వరలక్ష్మి భర్త పోసా భాస్కర్ 37వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంలో ఎవరికీ అందించని సహాయాన్ని పోసా కుటుంబానికి అందించారని, కానీ వారు వ్యతిరేకంగా తిరిగారని అన్నారు. ఇలాంటి ద్రోహం ఎవరు చేయరని, పార్టీ నమ్మకాన్ని తక్కువ చేసి టీడీపీలో చేరడం తప్పు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఓటర్లు పాల్గొన్నారు. వారు పోసా వరలక్ష్మి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకత్వాన్ని వంచించిన వారి రాజకీయం ఎప్పటికీ నిలబడదని అభిప్రాయపడ్డారు.