Elon Musk: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్(Apple–Google) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఆపిల్ అభివృద్ధి చేస్తున్న ‘ఫౌండేషన్ మోడల్స్’ ఆధారిత “ఆపిల్ ఇంటెలిజెన్స్” ఇకపై గూగుల్ జెమినై ఏఐ మోడళ్లతో కలిసి పనిచేయనుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆపిల్ వినియోగించుకోనుంది. ఇది మల్టీ ఇయర్ ఒప్పందమని ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
ఈ డీల్‌పై టెస్లా, స్పేస్‌ఎక్స్, xAI సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ రంగంలో గూగుల్ గుత్తాధిపత్యం మరింత బలపడే ప్రమాదం ఉందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
ALSO READ:Greenland Merger Bill: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను…విలీనం కోసం అమెరికాలో బిల్లు
ఇప్పటికే ఆండ్రాయిడ్, క్రోమ్ వంటి ఉత్పత్తులతో గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తోందని విమర్శించారు.
ఏఐ రేసులో వెనుకబడ్డాయన్న విమర్శల మధ్య ఈ ఒప్పందం ఆపిల్‌కు కీలకంగా మారింది. గూగుల్ జెమినై మోడళ్లు, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయడం వల్ల ఆపిల్ ఏఐ సామర్థ్యాలు గణనీయంగా పెరగనున్నాయి.
ముఖ్యంగా సిరి పనితీరు మరింత మెరుగుపడి, శక్తివంతమైన డిజిటల్ అసిస్టెంట్‌గా మారనుందని ఆపిల్ వర్గాలు వెల్లడించాయి.
అయితే వినియోగదారుల గోప్యత విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆపిల్ స్పష్టం చేసింది. యూజర్ డేటాను గూగుల్‌కు అందించబోమని, మొత్తం ప్రాసెసింగ్ యాపిల్ డివైజులు, ప్రైవేట్ క్లౌడ్ వ్యవస్థల్లోనే జరుగుతుందని తెలిపింది.
గతంలో ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం సమయంలో కూడా ఇలాగే స్పందించిన ఎలాన్ మస్క్, సిరిలో చాట్‌జీపీటీని ఐచ్చిక ఫీచర్‌గా అందించడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
తాజా పరిణామాలు మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
