Iran war tensions: ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ ప్రాంతాలపై కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చిన్న కుమార్తె శ్రీజ కొణిదల ప్రస్తుతం దుబాయ్ లో తన కుమార్తెలు నివృత్తి, నావిష్కలతో కలిసి ఉన్నారు.
పరిస్థితుల దృష్ట్యా అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తాము సురక్షితంగా ఉన్నామని ఎవరు ఆందోళన పడొద్దు అని తెలిపారు. బుర్జ్ ఖలీఫా నేపథ్యంతో ఫోటో షేర్ చేస్తూ శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
ఇదే సమయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు (P. V. Sindhu) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నట్లు సమాచారం. విమాన సర్వీసులు ఆకస్మికంగా నిలిచిపోవడంతో ఆమె ప్రయాణం వాయిదా పడింది.
నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్‌లోనే ఉండి, భారత్‌కు సురక్షితంగా చేరేందుకు సహాయం కోరినట్లు తెలిసింది.
ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో స్వల్ప నష్టం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. జెబెల్ అలీ పోర్ట్ వద్ద మంటలు చెలరేగినట్టు సమాచారం.
యూఏఈ ప్రభుత్వం ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరిస్థితులపై గల్ఫ్ దేశాల్లో ఆందోళన నెలకొంది.









