AP Space City: ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, సేవల రంగాల్లో రాష్ట్రాన్ని జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 15,000 ఎకరాల్లో ఈ స్పేస్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించడం, దేశీయ–విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక స్పేస్ పాలసీని అమలు చేస్తూ, రాబోయే ఐదేళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
స్పేస్ సిటీ అభివృద్ధిని దశలవారీగా చేపట్టనున్నారు. దీనికోసం తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం రౌతుసురమాల ప్రాంతాన్ని ప్రభుత్వం అనుకూలంగా ఎంపిక చేసింది. తొలి దశలో 2,801.43 ఎకరాల్లో అంతరిక్ష పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టనున్నారు.
ఈ దశలో భాగంగా 571.70 ఎకరాల్లో స్టార్టప్ యాక్టివేషన్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.140.95 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులను కల్పించనుండగా, పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
స్టార్టప్ యాక్టివేషన్ ఏరియాలో పరిపాలనా భవనాలు, ఇంక్యుబేషన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాల్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి ‘ప్లగ్ అండ్ ప్లే’ తరహా సౌకర్యాలతో సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తిరుపతి సమీపంలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, సెమీకండక్టర్ పరిశ్రమలకు అనుమతులు లభించడంతో, వాటి సమీపంలోనే స్పేస్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ప్రతిపాదిత స్పేస్ సిటీ ప్రాంతానికి సమగ్ర రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతం జాతీయ రహదారి–71 నుంచి కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉండగా, స్టేట్ హైవే–480 ద్వారా ఎన్‌హెచ్–16కు అనుసంధానం ఉంది. హౌరా–చెన్నై రైల్వే లైన్‌లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ 27 కిలోమీటర్లు, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం 30 కిలోమీటర్లు, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు 70 కిలోమీటర్లు, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఎగుమతులు, దిగుమతులకు అనువైన లాజిస్టిక్స్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
స్పేస్ సిటీకి అవసరమైన నీటి సరఫరా కోసం 70 కిలోమీటర్ల దూరంలోని కండలేరు జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమీప పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం ఇప్పటికే రూ.200 కోట్ల విలువైన పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి.
అలాగే, హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండటంతో స్పేస్ సిటీకి పూర్తి స్థాయి డిజిటల్ కనెక్టివిటీ కల్పించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష పరిశ్రమల హబ్‌గా మారే దిశగా కీలక అడుగు పడనుంది.









