తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ సాహితీవేత్త అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో సాహిత్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
జనగాం సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు “అందె ఎల్లయ్య”. చిన్ననాటి నుంచే ఆయనకు కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. తన భావోద్వేగాలు, తెలంగాణ భూమిపై ప్రేమను పద్యాల రూపంలో వ్యక్తం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు.
ALSO READ:కరీంనగర్‌లో కలకలం స్కూటీ నుంచి బయటపడ్డ పాము పిల్ల
అందెశ్రీ రచించిన “జయ జయ హే తెలంగాణ” రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన పాటలు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. సాహిత్యంలో, ముఖ్యంగా ప్రజాకవిత్వంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానముంది.
ఇటీవల 2024 జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం”రేవంత్ రెడ్డి” చేతుల మీదుగా అందెశ్రీ రూ.1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు. తెలంగాణ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆయన మరణం రాష్ట్రానికి పెద్ద నష్టంగా పరిగణిస్తున్నారు.
