CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి ఆయన దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి రాష్ట్ర అవసరాలను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వచ్చేలా కేంద్ర సహకారం కోరనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీలో ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల అంశంపై చర్చించనున్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, అంతర్రాష్ట్ర వివాదాలపై కీలక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాలు, బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రానికి వివరించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర మంత్రులతో చర్చలు జరపాలని సీఎం భావిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు, పెండింగ్ అంశాల పరిష్కారం, రాష్ట్రానికి అవసరమైన అనుమతుల సాధనపై ఈ ఢిల్లీ పర్యటన కీలకంగా మారనుంది.
ALSO READ: Tata Motors Upcoming Cars | టాటా నుంచి 5 కొత్త కార్లు.. టాటా భారీ ప్లాన్ ఇదే!








