Nara Lokesh: మత్తు పదార్థాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ(Nasha Mukt Yuva) ఫర్ వికసిత్ భారత్(Viksit Bharat) సంకల్ప్ అభియాన్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మద్దతు ప్రకటించారు. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. డ్రగ్స్ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా 100 వారాల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమం యువతలో చైతన్యం తీసుకురావడంలో కీలకంగా మారుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నారా లోకేశ్ తెలిపారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంతో అవగాహన కల్పిస్తూనే, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ సమస్యను కేవలం ప్రభుత్వ చర్యలతోనే పూర్తిగా అరికట్టలేమని, ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, యువత అందరూ కలిసి ముందుకు వస్తేనే మత్తు రహిత ఆంధ్రప్రదేశ్, మత్తు రహిత భారత్ లక్ష్యం సాకారమవుతుందని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.








